ముందుమాట
చింతపండు పులుపుతో రసం శిలాద్రవంలా మరుగుతోంది.
2025 మార్చి 5వ తేదీ, సమయం ఒంటి గంట దాటింది. నగరాన్ని నిశ్శబ్దంగా మార్చే ఒక మధ్యాహ్నం. బార్సిలోనాలో బయట వాతావరణం చల్లగా, తడిగా ఉంది.
నేను వండుతున్న రసం రెసిపీ వనిత వంటకాలు అనే చిన్న, నారింజ రంగు పుస్తకంలోని 39వ పేజీలోనిది. మా అమ్మమ్మ 1976లో రాసి, స్వయంగా ప్రచురించిన వంటల పుస్తకం అది. రెండేళ్ళ క్రితం బెంగళూరు నుండి ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఎవరూ తెలియని, భాష అర్థంకాని ఒక కొత్త నగరంలో అమ్మమ్మ పుస్తకం ఒంటరితనానికి ఓదార్పుగా, నాకు తోడుగా నిలిచింది. అమ్మమ్మను పోగొట్టుకున్న సరిగ్గా పద్దెనిమిదేళ్ల తరువాత, ఇల్లంతా ఆమె కమ్మని రసం పోపువాసన ఆవరించుకున్న ఆ మధ్యాహ్నం తన పుస్తక పునర్ముద్రణ పని మొదలుపెట్టాను.
అప్పట్లో వనిత వంటకాలు ఒక అనూహ్య సంచలనం సృష్టించింది. అపారమైన పాఠకాభిమానాన్ని చూరగొని, మూడు ముద్రణలలో పదిహేనువేల ప్రతులకు పైగా అమ్ముడుపోయి ఒక క్లాసిక్‌గా మారింది. 1957లో వారి వివాహానికి ముందు అమ్మమ్మకు పెద్దగా వంట రాదని మా తాతయ్య ఇప్పటికీ చెబుతారు. కానీ ఒక్కసారి మాత్రం, పదహారేళ్ళ వయసులో, ఎవరికీ తెలియకుండా ఒక వంటల పోటీలో పాల్గొని, తన మైసూర్ పాక్ రెసిపీతో ప్రథమ బహుమతి గెలుచుకుందట. "వంట కళ ఆమె రక్తంలోనే ఉందని నాకు ఎప్పుడూ అనిపించేది," అని ఆయన అంటుంటారు. అందుకేనేమో ఆమె తన వంటల పుస్తకం మొదటి ముద్రణ ఆదాయంతో గర్వంగా మా అమ్మ వైద్య కళాశాల ఫీజు చెల్లించింది. 1983లో చివరి ముద్రణ తరువాత నాలుగు దశాబ్దాల పాటు ఈ పుస్తకం ప్రచురణలో లేకపోయినా, పాఠకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది.
ఏళ్ళు గడిచే కొద్దీ, కొత్త కొత్త రుచుల అన్వేషణలో అమ్మమ్మ వంట నైపుణ్యం పెరుగుతూ వచ్చింది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి బాగా గుర్తున్న ఒక దృశ్యం — ఏ కొంత ఖాళీ సమయం దొరికినా చేతికి అందిన ఏ కాగితం ముక్కపైనైనా అమ్మమ్మ రెసిపీలు రాసుకుంటూ ఉండటం. పాత నోట్బుక్లలో, పెళ్లి పత్రికలపై, ప్రిస్క్రిప్షన్ల వెనుక సైతం! 2007 మార్చిలో, నిర్ధారణ అయిన తొమ్మిది వారాలకే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో ఆమె చనిపోయింది. ఆ సమయానికే కొత్త ముద్రణ కోసం మూడు వందలకు పైగా రెసిపీలను సమీక్షించి, ఒక స్పైరల్ పుస్తకంలో సేకరించి పెట్టింది. ఇవే కాక ఆమె వెళ్లిపోయాక రెసిపీలతో నిండిన మరెన్నో కార్డ్బోర్డ్ పెట్టెలు దొరికాయి.
చనిపోవడానికి కొంతకాలం ముందు, అమ్మమ్మ తన చివరి కోరికలు నాతో పంచుకుంది — తను సేకరించిన కొత్త రెసిపీలను కలిపి వనిత వంటకాలు మళ్ళీ ప్రచురించాలని; తన పుస్తకం మరెందరికో చేరేలా ఒక ఆంగ్ల అనువాదం చేయాలని. అమ్మమ్మ ఉన్నంతవరకు ఒక కప్పు టీ కూడా పెట్టడం రాని నేను, ఆమె కలను నెరవేర్చడానికి మొండి ధైర్యంతో ఆంగ్ల అనువాదం మొదలుపెట్టాను. ఆమె రెసిపీలన్నీ ఒక్కొక్కటిగా ప్రయోగించి చూసి, అందులో 106 వంటకాలను ఆంగ్లంలోకి అనువదించి Five Morsels of Love అనే పుస్తకంగా తీసుకొచ్చాను. ఇది సాధించడానికి నాకు తొమ్మిదేళ్లు పట్టింది.
కానీ అప్పటికి నా ఇంగ్లీష్ మీడియం చదువుతో ఒకేసారి నేరుగా తెలుగులోకి ఈ పుస్తకాన్ని తీసుకువచ్చే సాహసం చేయలేకపోయాను.
2016లో Five Morsels of Love ప్రచురించిన తరువాత పాఠకులు కూడా అమ్మమ్మ తెలుగు పుస్తకం గురించి ఆసక్తిగా అడగడం మొదలుపెట్టారు. అదే సమయంలో అమ్మమ్మ వంటల పుస్తకం ఎడిటర్ నంబూరి పరిపూర్ణ గారిని అనుకోకుండా కలిశాను. వారు అమ్మమ్మతో కలిసి పని చేసిన ఎన్నో జ్ఞాపకాలను నాతో పంచుకున్నారు. ఆ తరవాత అమ్మమ్మ తెలుగు పుస్తకాన్ని పునర్ముద్రించాలనే ఆలోచన నా మనసులో మరింత బలపడింది. చివరి సంకేతం 2022 జూన్‌లో నా రెండవ పుస్తకం Why Cook పని ముగుస్తుండగా కనిపించింది. ప్రింటింగ్ ప్రెస్‌లోని షెడ్యూల్ బోర్డుపై ఇలా రాసి ఉంది - Next job: Nirmala.
వెనక్కి తిరిగి చూస్తే, అమ్మమ్మ నాకు దారి పొడవునా చిన్న చిన్న గుర్తులు వదిలి వెళ్ళినట్లు అనిపిస్తుంది.
ఒక పని కావాలంటే పదిమంది పూనుకోవాలి అంటారు. నేను తెలుగులో సరిగ్గా తీసుకురాగలనో లేదో అని సంశయిస్తున్నప్పుడు, అనుకోని వరంలా పరిపూర్ణ గారి మనవరాలు, తెలుగు రచయిత అపర్ణ, సలహాదారుగా తోడయ్యింది. నా కాలేజీ స్నేహితురాలు చందన సహ సంపాదకురాలిగా వెంట వచ్చింది. నా ఆంగ్ల పుస్తకాల ఎడిటర్ సోనియా, తన సలహాను అందించింది. ఆ పుస్తకాలను డిజైన్ చేసిన ఎస్తర్, ఈ పుస్తకానికి కూడా తన కళాత్మకతను జోడించింది.
తెలుగు పుస్తకం పునర్ముద్రణ పని మొదలుపెట్టినప్పుడు, ఇది ఇంత పెద్ద ప్రయత్నంగా మారుతుందని నేను ఊహించలేదు. వందలాది రెసిపీలను చదివి వేటికవి విడిగా పేర్చేటప్పుడు, వనిత వంటకాలు విడివిడిగా చిన్న పుస్తకాలుగా కొత్త రూపంలో అందిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. అందుకే పాఠకుల సౌలభ్యం కోసం ఇలా మూడు భాగాలుగా ప్రచురించాలనే నిర్ణయం తీసుకున్నాను — శాకాహార వంటలు; మాంసాహార వంటలు; టిఫిన్లు, స్వీట్లు & పచ్చళ్ళు.
ఈ మొదటి సంపుటిలో తొంభైకి పైగా రుచికరమైన శాకాహార వంటకాలను సేకరించాము. చందనతో కలిసి నేను అన్ని వంటలను వండి చూసి, పదార్థాల పరిమాణాలు, వంట సమయాలను సవరించి, ఇప్పటి తరాలకు సులభంగా అర్థమయ్యేలా వంట సూచనలను వివరించాము. ఈ మార్పులన్నిటిలోనూ అమ్మమ్మ మూలరచన స్ఫూర్తికి దగ్గరగా ఉండేలా ప్రయత్నించాము.
సంప్రదాయ వేపుడ్లు, కూరలు, పప్పులు, పులుసులతో పాటు అమ్మమ్మ తన వంట సంపదలో భాగంగా చేసుకున్న ఇతర ప్రాంతాల వంటకాలు ఈ సంపుటిలో కనిపిస్తాయి. ఆగ్రాటిన్ వంటి విదేశీ రెసిపీలు, ఇండో-చైనీస్ రుచులు, నార్త్ ఇండియన్ వంటలు, మరెన్నో వైవిధ్యమైన వంటకాలు ఒక ప్రత్యేక చాప్టర్లో కూర్చాము.
ఈ సంపుటిలోని వంటకాలన్నీ నా చిన్ననాటి జ్ఞాపకాలతో అల్లుకుపోయినవి. రాగి సంగటి, పచ్చి పులుసు వండిన ప్రతిసారి, చిన్నదాన్నైపోయి అమ్మమ్మతో వేసవి సెలవుల మధ్యాహ్నాలు గడుపుతాను. నా చిట్టి చేతులకు గోరింటాకు పెట్టి రసం అన్నం తినిపించిన ఎన్నో గారాబాలు, ఒంట్లో బాలేనప్పుడు అమ్మమ్మ కాచిచ్చిన మిరియాలచారు ఓదార్పు, నా పెళ్లి రోజున ఉలవచారు అన్నంతో కలిపి తినిపించిన గోరుముద్దల జ్ఞాపకం — ఇవన్నీ ఇప్పటికీ నాలో సజీవంగా ఉన్నాయి. బహుశా అందుకేనేమో, నేను ఎన్ని ఇళ్లు మారినా, ఒక సీసా ఉలవ చారు మాత్రం నా ఫ్రిడ్జిలో ఎప్పుడూ ఉంటుంది.
Five Morsels of Love అమ్మమ్మను కోల్పోయిన బాధలో నాకు తోడుగా నిలిస్తే, ఇంటి నుండి దూరమైనప్పుడు వనిత వంటకాలు ధ్రువతారగా మారి, ఇక్కడ జీవితాన్ని నిర్మించుకోవడానికి దారి చూపించింది.
ఈ సంపుటిలో మీరు రుచి చూడబోయే వంటలు వందల సంవత్సరాల సంప్రదాయాన్ని ప్రతిధ్వనిస్తాయి. అయినప్పటికీ, కచ్చితమైన కొలతలనే కట్టుబాట్లు లేకుండా, ఒకటి రెండు పదార్థాల లోటును, రోజువారీ చిన్న ప్రయోగాలను అనుమతించి అనాయాసంగా, హాయిగా చేసుకోగలిగేవిగా ఉంటాయి.
ఇవి దేశం కాని దేశంలో, ఇంటి మీద బెంగటిల్లిన సమయాలలో ఆపేక్షగా పలకరించి జ్ఞాపకాలతో కడుపు నింపుతాయి.
అర్చన
మే 2026